తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అడ్డా కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ గిరిజన మహిళ హత్యాచారానికి గురైంది. మహిళకు మద్యం తాగించి అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు నిందితుడు. కామారెడ్డి శివారులో మంగళవారం నాడు ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని ఓ తండాకు చెందిన మహిళ (32) సొంతూరు ఉపాధి లేకపోవడంతో జిల్లా కేంద్రంలో అడ్డా కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది.
నవంబరు 17న ఉదయం బయటకు వెళ్లిన మహిళా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు ఆమె భర్త. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలింపు మొదలు పెట్టారు. పోలీసుల విచారణలో లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన ప్రకాశ్‌తో మహిళకు పరిచయం ఉన్నట్లు తెలిసింది. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మహిళను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్న ప్రకాష్.. కామారెడ్డి శివారులోని లింగాపూర్ పరిధిలో మృతదేహాంగా పడి ఉన్న మహిళను చూపించాడు.
పని కోసమని బైక్‌పై మహిళను తీసుకొచ్చానని, ఆ తర్వాత మద్యం తాగించి అత్యాచారం చేశానని నిందితుడు చెప్పాడు. అనంతరం మహిళ గొంతుకు చున్నీ బిగింగి చంపేశానని తెలిపాడు. కాగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.