దారుణం: ఇద్దరు పిల్లలను చంపి.. నరాలు కోసుకుని తల్లి ఆత్మహత్యాయత్నం
Woman kills two sons, attempts suicide. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నేషనల్ చిల్డ్రన్స్ డే రోజున ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపేసింది.
కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నేషనల్ చిల్డ్రన్స్ డే రోజున ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపేసింది. ఆ తర్వాత తల్లి ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి వెళ్తే.. పాలక్కడ్ జిల్లా మంజాకన్‌దాత్‌కు చెందిన దివ్య తన భర్త రాజేశ్, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. గత కొంత కాలంగా భార్య, భర్తలకు మధ్య కలహాలు చోటు చేసుకుంటున్నాయి. తరచూ దివ్యకు భర్తతో గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం నాడు రాత్రి మతిస్థిమితం కోల్పోయి తన ఇద్దరు పిల్లలు అనిరుధ్ (4), అభినవ్(1)ను తల్లి దివ్య చంపింది.
ఆ తర్వాత దివ్య నిద్ర మాత్రలు మింగి.. నరాలను కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. రాజేష్ నానమ్మ కూడా నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు తెలిపారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే వృద్ధురాలికి ఎలాంటి ప్రాణపాయం లేదని, దివ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దివ్య తీసుకున్న ఈ విపరీతమైన చర్యకు గృహ హింసే కారణమని పోలీసులు అంటున్నారు.
పేరు చెప్పడానికి ఇష్టపడని షోరనూర్ పోలీస్ స్టేషన్‌లోని సీనియర్ పోలీసు అధికారు ఒకరు మాట్లాడుతూ.. ఇంట్లో గొడవలు రావడంతో తల్లి మతిస్థిమితం కోల్పోయి పిల్లలను చంపినట్లు అనిపిస్తోంది. తల్లి తన 4,1 సంవత్సరాల వయస్సు గల మగపిల్లలను చంపడానికి ఇంత విపరీతమైన చర్య తీసుకుంటుంటే, ఆమె తన మనస్సును కోల్పోయిందని లేదా కొన్ని గృహ సమస్యలను భరించలేక పోయిందని అర్థం. ఆమె భర్త నానమ్మ కూడా నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిందనే కారణంతో సహా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.