15 రోజుల క్రితం నరికి చంపుతానని భర్తకు వార్నింగ్ ఇచ్చింది.. అదే చేసింది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమీర్ పూర్‌లో సంచలన ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమీర్ పూర్‌లో సంచలన ఘటన వెలుగు చూసింది. భర్తను కత్తితో పొడిచి హత్య చేసినా భార్యకు పశ్చాత్తాపం కలగలేదు. తన పిల్లల భవిష్యత్తును కాపాడేందుకే భర్తను హత్య చేశానని బహిరంగంగా చెబుతోంది. కస్బా ముస్కరాలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మోతీ నగర్ స్థానిక బైజ్‌నాథ్ అగర్వాల్ విద్యాలయ వెనుక భాగంలో అరవింద్ రక్వార్‌ను అతని భార్య అనిత పెద్ద కత్తితో ఐదుసార్లు పొడిచి హత్య చేసింది. అనంతరం మార్కెట్‌లో ఉన్న పెద్ద కుమారుడిని పిలిచింది.
కొడుకు దినేష్ వచ్చి తన తండ్రి రక్తంతో తడిసి పడి ఉండటాన్ని చూశాడు. కొడుకు పక్కనే కూర్చుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇద్దరిపై దాడి చేసి వెళ్లిపోయారని తల్లి పోలీసులకు తెలిపింది. అదే సమయంలో మృతుడి కుమారుడు రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై హత్య కేసు నమోదు చేశారు. అయితే సాయంత్రం వరకు పోలీసుల విచారణలో మృతుడి భార్య తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. ఆ తర్వాత నిందితురాలైన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఘటన జరిగిన రెండో రోజైన మంగళవారం పోలీస్ స్టేషన్‌లో కూర్చున్న భార్య ముఖంలో ఎలాంటి బాధ, పశ్చాత్తాపం లేదు . ఆమె రిలాక్స్‌గా కూర్చుంది. తన భర్తను చంపినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని బహిరంగంగా చెప్పింది. తన భర్త మద్యానికి బానిసై నిత్యం జూదం ఆడుతూ ఇంటిని సర్వనాశనం చేశాడు. దీంతో తరచూ గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం కూడా పట్టణంలోని బస్టాండ్ సమీపంలో వీరిద్దరికి గొడవ జరిగింది. ఆ సమయంలో మాట్లాడుతూ అనిత తన భర్త అరవింద్‌తో.. నువ్వు బాగుపడకుంటే నిన్ను కత్తితో నరికి చంపేస్తానని బెదిరించగా.. అది నిజం చేసి నిరూపించింది. పెళ్లయిన ఏడాది నుంచి తన భర్త తనతో నిరంతరం గొడవ పడుతూనే ఉన్నాడని అనితా రక్వార్ చెప్పారు. ఘటన జరిగిన రోజు కూడా మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మొదట ఆయన సమీపంలో ఉన్న కత్తిని తీసుకొని నాపై దాడి చేయడానికి ప్రయత్నించాడు.. దాని కారణంగా నా చేతికి స్వల్ప గాయమైంది. ఆ తర్వాత నేను తిరగబడి అతనిపై కత్తితో దాడి చేశాను. తన పిల్లల భవిష్యత్తు కోసం తన భర్తను కత్తితో పొడిచి చంపాల్సి వచ్చిందని అనిత అందరి ముందు చెప్పింది. ఈ విషయమై పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి యోగేష్ తివారీ మాట్లాడుతూ.. మహిళను జైలుకు పంపినట్లు తెలిపారు.