ఆడబిడ్డ, మగబిడ్డ ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉంటాయా అని అనుకోవచ్చు..! కానీ కొందరు మూర్ఖులు మగబిడ్డ మాత్రమే పుట్టాలి.. లేదంటే మీ అంతు చూస్తామంటూ భార్యలను ఏడిపిస్తున్న ఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. భార్య మగబిడ్డను కనలేదనే కోపంతో తన పైశాచికాన్ని చూపించాడు. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారన్న కోపంతో భార్యపై సలసలకాగే నీళ్లు పోశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో చోటు చేసుకుంది.
షాజహాన్‌పూర్‌కు చెందిన సత్యపాల్‌కు 2013లో సంజుతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. ముగ్గురు కుమార్తెలే పుట్టడంతో పుట్టింటి నుంచి రూ. 50 వేలు తీసుకురావాలంటూ కొంతకాలంగా సత్యపాల్ భార్యను వేధిస్తున్నాడు. ఇటీవల ఆమెకు భోజనం కూడా పెట్టడం లేదు. ఈ నెల 13 ఇంట్లో ఉన్న భార్యతో వాగ్వాదానికి దిగాడు సత్యపాల్. నీ వళ్లనే అందరూ ఆడపిల్లలు పుట్టారు.. ఒక్క వారసుడు కూడా లేడు అంటూ ఆవేశంలో వేడినీళ్లు పోశాడు. ఆమె తీవ్రంగా గాయపడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.