ముంబయి : 20 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రైవేట్ భాగాల్లో బ్లేడ్ ఉందని వైద్యులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగిందనే అనుమానాలతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ప్రైవేట్ పార్ట్‌లలో సర్జికల్ బ్లేడ్‌ని చొప్పించారని, దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ గాయాల తీవ్రత కారణంగా కెఇఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రైవేట్ పార్ట్ లో ఉంచిన బ్లేడ్‌ను వైద్యులు విజయవంతంగా తొలగించారు.
జనవరి 20న ఆమె తన మామతో కలిసి లక్నో లేదా బనారస్ నుండి వచ్చినట్లు ఆమె చెబుతోంది. బాంద్రా స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ఆమె గోరేగావ్‌కు వెళ్ళింది. అక్కడ తనపై అత్యాచారం జరిగిందని, తన ప్రైవేట్ భాగాల్లోకి బలవంతంగా బ్లేడ్‌ని చొప్పించారని ఆమె ఆరోపించింది. వారి నుండి తప్పించుకున్నట్లు చెప్పింది.. అయితే ఆమె గోరెగావ్‌కు ఎలా చేరుకుందో వివరించలేదు. అనేక పోలీసు బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి, బాంద్రా, గోరేగావ్ మధ్య స్టేషన్ల నుండి CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నాయి. బాధితురాలి నుండి సమాచారాన్ని తెలుసుకోడానికి సీనియర్ అధికారులు దర్యాప్తును నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.