కర్నాటకలోని కల్బుర్గిలో ఓ మహిళ తన కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కేందుకు సహాయం చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైంది. భాగ్యశ్రీ అనే 34 ఏళ్ల మహిళ, ఆమె కొడుకు ఇద్దరికీ గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. భాగ్యశ్రీ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఆమె కొడుకు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఆ పిల్లాడు దివ్యాంగుడు కావడంతో తల్లి కుమారుడిని బస్సు ఎక్కించేందుకు వచ్చింది.
ఉదయం 9:21 గంటలకు భాగ్యశ్రీ తన కొడుకుతో కలిసి బస్టాప్‌లో నిలబడగా, స్కూల్ బస్సు వచ్చింది. కొడుకు ఎక్కేందుకు ఆమె బస్సు వైపు వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె పడిపోయినప్పుడు ఆమె శరీరం నుండి నిప్పురవ్వలు వెలువడడం కనిపించింది. భాగ్యశ్రీని కరెంట్ షాక్ నుండి విడిపించడానికి వాహనాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని జనం బస్సు డ్రైవర్‌ను కోరారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాప్ సమీపంలో విద్యుత్ కేబుల్ వేలాడుతూ ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు సమీపంలోకి రాగానే కేబుల్ వాహనానికి తగలడం, భాగ్యశ్రీ బస్సును తాకడంతో విద్యుదాఘాతానికి గురైంది.