హైడ్రా భయంతో మహిళ ఆత్మ‌హ‌త్య‌.. స్పందించిన ఏవీ రంగనాథ్

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల ప్రజలు హైడ్రాకు భయపడుతున్న సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  28 Sept 2024 7:45 AM IST
హైడ్రా భయంతో మహిళ ఆత్మ‌హ‌త్య‌.. స్పందించిన ఏవీ రంగనాథ్

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల ప్రజలు హైడ్రాకు భయపడుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా చెరువులకు, కుంటలకు దగ్గరగా సొంత ఇల్లు కట్టుకున్న, కొనుక్కున్న వారి పరిస్థితి అయితే ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. ఒకప్పుడు అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలకు పాల్పడుతూ ఉండడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఓ మహిళ అధికారులు ఎక్కడ తన ఇంటిని కూల్చివేస్తారోనని ఆత్మహత్య చేసుకుంది.

కూకట్‌పల్లిలోని చెరువుకి సమీపంలో నిర్మించిన తన ఇంటిని హైడ్రా అధికారులు కూల్చివేస్తారనే భయంతో ఓ మహిళ శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లిలోని యాదవ్‌ బస్తీలో నివాసముంటున్న జి.బుచ్చమ్మ, ఆమె భర్త జి.శివయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు. కట్నంగా కూతుర్లకు ఇళ్లు రాసిచ్చారు. ఆ ఇళ్లు కూకట్‌పల్లి చెరువుకు సమీపంలోనే ఉంది. దీంతో ఆ ఇళ్లు ఎక్క‌డ కూల్చివేస్తారేమోన‌ని భ‌యంతో బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అయితే.. ఈ ఘటనకు, హైడ్రాకు సంబంధం లేదని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. 'మేము ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బుచ్చమ్మ ఆత్మహత్య గురించి కూకట్‌పల్లి పోలీసులతో మాట్లాడాను. శివయ్య దంపతుల కూతుర్లుకు రాసిచ్చిన ఇళ్లు.. కూకట్‌పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నాయి. కానీ.. ఎఫ్‌టీఎల్‌ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కుమార్తెలు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది' అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు.

Next Story