ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహిళలను నమ్మించి దారుణాలకు పాల్పడుతున్నారు మావనరూపాల్లో ఉన్న మృగాలు. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి అత్యాచారం చేశాడని ఓ మహిళ గోపాలపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల మహిళ, ప్రైవేట్ ఉద్యోగి, నిందితుడు సుందర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులుగా మారారు. ఆ తర్వాత సంబంధం ఏర్పర్చుకున్నారు. అతను ఆమెకు ప్రపోజ్ చేయగా ఆమె అంగీకరించింది. అప్పటి నుండి, వారు చాలా సందర్భాలలో కలుసుకున్నారు.
ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి భోయిగూడ రైల్వే ఆఫీసర్స్ కాలనీ సమీపంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఇటీవల ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరగా, సుందర్ నిరాకరించాడు. ఆమె నుండి తప్పించుకోవడం ప్రారంభించాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు అత్యాచారం, మోసం తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.