ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో 14 ఏళ్ల బాలుడు.. 40 ఏళ్ల మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే జరిగిన దాడిలో మహిళ మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 3న పొలంలో గడ్డి కోస్తుండగా 9వ తరగతి చదువుతున్న బాలుడు మహిళపై దాడి చేశాడు. ఆ బాలుడు ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించింది. ఆ తర్వాత అతను కొడవలి, కర్రతో ఆమెపై దాడి చేసి తీవ్ర గాయాలపాలు చేశాడు. పొలంలో రక్తస్రావం అవుతున్న ఆమెను గ్రామస్తులు గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆమెను చండీగఢ్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె మరణించింది. నేరం జరిగిన ప్రదేశం నుండి పోలీసులు ఒక కొడవలి, ఒక కర్ర, విరిగిన స్కేల్, పెన్ను ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, మైనర్ దాడి చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. అప్పటి నుండి అతన్ని అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచారు. తన 17 ఏళ్ల వికలాంగుడైన కొడుకును పెంచుతున్న ఆ మహిళ తన కుటుంబానికి ఏకైక ఆధారం. మైనర్ నిందితుడు అదుపులో ఉన్నాడని, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని హమీర్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ ఉపాధ్యాయ్ ధృవీకరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.