రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దన్నారం గ్రామంలో ఓ మహిళ భర్తను దగ్గరుండి మరీ చంపించేసింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంగా ప్రియుడితో కలిసి హత్య చేసింది. పోలీసుల కథనం ప్రకారం, దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ప్రమీల దంపతులకు ఇద్దరి పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ప్రమీలకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇప్పటికే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి.
అర్ధరాత్రి సమయంలో ప్రమీల తన ప్రియుడిని ఇంటికి రప్పించింది. అతడితో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ప్రవీణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని తల్లిదండ్రులు, గ్రామస్థులు కందుకూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమీల ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.