మరో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
బాచుపల్లిలో దారుణం జరిగింది. భర్తను భార్య హత్య చేసింది.
By Medi Samrat
బాచుపల్లిలో దారుణం జరిగింది. భర్తను భార్య హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప, రాధా దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అంజిలప్ప తాగుడికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఆ మత్తులో భార్య రాధను అనుమానించేవాడు. ఆ వేధింపులు భరించలేక తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతిపై కూర్చొని గొంతు నులిమి చంపింది.
అనంతరం భర్త అంజిలప్ప అనారోగ్యంతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. ఆ తర్వాత భర్త మృతదేహాన్ని స్వగ్రామమైన నారాయణపేటకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే గొంతుపై ఉన్న మరకలు చూసి బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాచుపల్లి పోలీసులు రాధను అదుపులోకి తీసుకుని విచారించడంతో భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్‌కు తరలించారు.