మైనర్ బాలికను బయటకి పిలిచి కలవడానికి ప్రయత్నించారు.. నిరాకరించడంతో నిప్పంటించారు
When girl refused to meet, 2 boys entered house and burned her down. బీహార్ రాష్ట్రంలోని బంకా ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికను
By Medi Samrat Published on 14 Nov 2021 10:44 AM GMT
బీహార్ రాష్ట్రంలోని బంకా ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికను ఇద్దరు యువకులు కలిసి తగులబెట్టారు. చాలా రోజుల తర్వాత ఈ ఘటనకు సంబంధించిన విషయం బయటకు వచ్చింది. బీహార్‌లోని బంకాలో ఓ యువతిని దహనం చేసిన ఘటన వెలుగు చూసింది. బంకాలోని ధోరయ్యా బ్లాక్ ఏరియాలోని ధన్‌కుండ్ సహాయక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మైనర్ బాలికను సజీవ దహనం చేశారు. మంటల్లో బాలిక శరీరం తీవ్రంగా కాలిపోయింది. 12 రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు ధన్‌కుండ్ పోలీస్ స్టేషన్ పోలీసులకు ఇచ్చిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లవ్ కుమార్ సింగ్, సుమన్ సింగ్ ఈ ఘటనకు పాల్పడ్డారు. నవంబర్ 1న తన ఇంటి దగ్గరకు వచ్చిన నిందితులు లవ్ కుమార్, సుమన్ సింగ్ ఫోన్ లో తనను బయటకి పిలిచి కలవడానికి ప్రయత్నించారని బాలిక తన లిఖితపూర్వక దరఖాస్తులో పేర్కొంది. అందుకు బాలిక నిరాకరించడంతో ఆ ఇద్దరు యువకులు బాలికను చంపేస్తామని బెదిరించారు. మరుసటి రోజు బాలిక తండ్రి ఉదయం ధన్‌కుండ్ ఆలయానికి పూజలు చేయడానికి వెళ్ళాడు.
ఇంట్లోని ఇతర కుటుంబసభ్యులు మరో గదిలో నిద్రిస్తుండగా, నిందితులు ఇంటి వెనుక తలుపు ద్వారా బాలిక గదిలోకి ప్రవేశించారు. యువతి ఒంటరిగా ఉండటాన్ని చూసి ఆమెకు నిప్పంటించారు. మంటలు చెలరేగడంతో బాలిక అరవడం ప్రారంభించింది.. ఆ తర్వాత ఇద్దరు నిందితులు అక్కడి నుండి పారిపోయారు. గాయపడిన స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం భాగల్‌పూర్‌కు తీసుకెళ్లారు. బాధితురాలి వాంగ్మూలంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి అభినందన్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలుస్తోంది.