మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో 26 ఏళ్ల నర్సును వెంబడించి వార్డ్ బాయ్ కాల్చి చంపినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటన తరువాత, ఆసుపత్రిలో మెరుగైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది పనిని నిలిపివేసినట్లు అధికారి తెలిపారు. గురువారం రాత్రి ఐసీయూలో కంట్రీ మేడ్ పిస్టల్‌తో వార్డ్ బాయ్ రితేష్ షాక్యా హెడ్ పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపాడని భింద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శలేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. కాల్పుల అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని, బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు పిల్లల తండ్రి అయిన షాక్య మరో వ్యక్తితో వివాహం నిశ్చయించుకున్న బాధితురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిందితుడు తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలిని నెలల తరబడి వేధిస్తున్నాడని, అయితే ఆమె అతని అభ్యర్థనను తిరస్కరించిందని మృతురాలికి తెలిసినవారు పేర్కొన్నారు. ఇదిలావుండగా, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ 100 మందికి పైగా నర్సులు జిల్లా ఆసుపత్రిలో ఆందోళనకు దిగినట్లు ఒక అధికారి తెలిపారు. నిరసనల వల్ల రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అజిత్ మిశ్రా తెలిపారు.