కాల్ మనీ వేధింపులు.. భరించలేక వీఆర్వో ఆత్మహత్య..!

VRO Gouse commits Suicide in Krishna district. ఏపీలోని కృష్ణా జిల్లాలో కాల్‌ మనీ కలకలం సంచలనం రేపుతోంది. పోలీసులు పఠిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కాల్‌మనీ ఆత్మహత్యలు ఆగడం

By అంజి  Published on  30 Nov 2021 6:33 AM GMT
కాల్ మనీ వేధింపులు.. భరించలేక వీఆర్వో ఆత్మహత్య..!

ఏపీలోని కృష్ణా జిల్లాలో కాల్‌ మనీ కలకలం సంచలనం రేపుతోంది. పోలీసులు పఠిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కాల్‌మనీ ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా ఓ వీఆర్వో కాల్‌ మనీ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్‌ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన సోమవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గౌస్‌ కొండపల్లి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం గౌస్‌ తన కుటుంబ అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర కొంత అప్పు చేశాడు.

అయితే వీఆర్వో గౌస్‌ ప్రతి నెల వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. లక్షల్లో అప్పులు ఉన్నట్లు సృష్టించి కాల్‌ మనీ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వడ్డీకి తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేశారని, కాల్‌ మనీ మాఫియా చిత్ర హింసలు తాళలేక వీఆర్వో గౌస్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్‌ లెటర్‌ రాసి కొండపల్లిలోని అద్దెకు తీసుకున్న ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణమైన వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it