కీచ‌క‌ గురువు.. న‌మ్మిబాధ‌లు చెప్పుకున్న ఉపాధ్యాయురాలు.. అస‌భ్య ఫోటోలు తీసిన ఉపాధ్యాయుడు

Visakhapatnam Teacher Arrested for Blackmailing Female Teacher.స‌మాజంలో గురువుకు పవిత్ర‌మైన స్థానం ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2022 5:56 AM GMT
కీచ‌క‌ గురువు.. న‌మ్మిబాధ‌లు చెప్పుకున్న ఉపాధ్యాయురాలు.. అస‌భ్య ఫోటోలు తీసిన ఉపాధ్యాయుడు

స‌మాజంలో గురువుకు పవిత్ర‌మైన స్థానం ఉంది. విద్యార్థుల‌కు విద్యాబుధ్దులు నేర్పి వారిని స‌న్మార్గంలో న‌డిపించే ఉపాధ్యాయుడే దారి త‌ప్పాడు. త‌న‌ను న‌మ్మి వ్య‌క్తిగ‌త వివ‌రాలు పంచుకున్న ఓ ఉపాధ్యాయురాలికి మాయ‌మాట‌లు చెప్పి ఆమెను లోబ‌రచుకున్నాడు. అనంత‌రం స‌ద‌రు ఉపాధ్యాయురాలి అస‌భ్య ఫోటోల‌ను చిత్రీక‌రించాడు. వాటిని చూపిస్తూ ప‌లుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అత‌డి వేదింపులు తాళలేక బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా రావికమతం ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో సూరెడ్డి మహేశ్వరరావు ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నాడు. గ‌తేడాది విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులకు హాజ‌రు కాగా.. అక్క‌డ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన ఉపాధ్యాయుని ప‌రిచ‌యం అయింది. వారిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యంతో త‌న‌కు 2019లో వివాహ‌మైంద‌ని.. శారీరకంగా భ‌ర్త ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాడ‌ని త‌న బాధ‌ల‌ను చెప్పుకుంది. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింది.

ఈ క్ర‌మంలో గతేడాది సెప్టెంబరు 27న వీరిద్దరూ విజయవాడ బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ శారీర‌కంగా క‌లుసుకున్నారు. ఉపాధ్యాయురాలు అప‌స్మార‌క స్థితిలో ఉన్న‌ప్పుడు ఆమె అశ్లీల ఫోటోలను మ‌హేశ్వ‌రరావు తీసి బెదిరించ‌డం మొద‌లుపెట్టాడు. అత‌డి వేధింపులు తట్టుకోలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఉపాధ్యాయురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఉపాధ్యాయురాలి ఫోన్‌లో ఆమెకు తెలియకుండా రహస్యంగా ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాని ద్వారా ఆమె ఫోన్‌ ని తన కంట్రోల్‌లోకి తెచ్చుక‌ని.. అశ్లీల చిత్రాలను ఆమె బంధువులు, స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఆమెను వేర్వేరు ప్రాంతాలకు తీసుకువెళ్లి.. శారీరక వాంఛ తీర్చుకునేవాడు. బాధితురాలు ఈ నెల 4న విజ‌య‌వాడ‌లోని మ‌హిళా పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు అనంత‌రం మ‌హేశ్వ‌ర‌రావును అరెస్టు చేశారు.

Next Story
Share it