తక్కువకు బంగారం ఇస్తామంటూ మోసం చేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. ఈ మేరకు విజయవాడలో రైల్వే టీటీఐ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావుపై రైల్వే సూపరిడెంట్ ఆకుల వెంకట రాఘవేంద్ర రావు భార్య హేమ పోలీసులకు పిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు స్నేహితులు నాగమణి, మౌనిక పై కూడా ఫిర్యాదు చేశారు. నమ్మించి మోసం చేశారని ఆకుల హేమ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మొదట రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం రూ.17 లక్షల 88 వేల రూపాయలు వెంకటేశ్వరరావు, అతని స్నేహితులు తీసుకున్నారు.
ఫ్లాట్లు ఇప్పిస్తామంటూ మరో రూ. 16 లక్షల రూపాయలు వెంకటేశ్వరరావు తీసుకున్నారని.. డబ్బులు అవసరం అని త్వరలోనే సర్దుబాటు చేస్తామని చెప్పి మరో రూ. 95 వేల రూపాయలు రెండు సార్లుగా తీసుకున్నారనీ హేమ పేర్కొన్నారు. ఫ్లాట్స్ గురించి అడిగినప్పుడు నాకు తక్కువలో బంగారం వస్తుంది.. మీకు ఇస్తాను అని నమ్మించారని.. ఫ్లాట్స్, బంగారం ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసి తప్పించుకు తిరుగుతున్నారని.. న్యాయం జరిగేలా చూడాలని సత్యనారాయణపురం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సత్యనారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.