ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలుడిని ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. ఉపాధ్యాయుడు తన ఫోన్‌లో అశ్లీల చిత్రాలను చూస్తున్నట్లు రెండో తరగతి విద్యార్థితో పాటు సహవిద్యార్థులు చూశారు. దీంతో బాలుడిని ఉపాధ్యాయుడు కొట్టాడని పోలీసులు తెలిపారు.
ఉపాధ్యాయుడు కుల్దీప్ యాదవ్ అసభ్యకరమైన కంటెంట్‌ను చూస్తున్నాడని గుర్తించిన విద్యార్థులు అతనిని చూసి నవ్వారు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు ఓ బాలుడిని కొట్టాడు.
‘‘టీచర్ నా కొడుకు జుట్టు పట్టుకుని తలను గోడకు బాదాడు. దీంతో నా కొడుకు చెవికి గాయాలు అయ్యాయి. టీచర్ అసభ్య పదజాలంతో దూషించి కొడుకును బెత్తంతో కొట్టాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను" అని బాలుడి తండ్రి జై ప్రకాష్ అన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడైన ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. రూరల్ పోలీసు సూపరింటెండెంట్ గోపీనాథ్ సోని మాట్లాడుతూ.. ''ఒక పాఠశాలలో దాడి కేసు వెలుగులోకి వచ్చింది. దీనిలో 8 ఏళ్ల పిల్లవాడిని అతని క్లాస్ టీచర్ కొట్టాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు టీచర్‌ని అదుపులోకి తీసుకున్నాం'' అని తెలిపారు.