బదిలీపై మనస్తాపం.. ఆర్టీసీ డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Upset over transfer, TSRTC driver ends life in Peddapalli. బదిలీపై మనస్తాపం చెందిన టీఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్‌ పెద్దపల్లిలో ప్రాణాలు విడిచాడు.

By Medi Samrat  Published on  26 Nov 2022 3:25 PM IST
బదిలీపై మనస్తాపం.. ఆర్టీసీ డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య‌

బదిలీపై మనస్తాపం చెందిన టీఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్‌ పెద్దపల్లి జిల్లాలో ప్రాణాలు విడిచాడు. వివ‌రాళ్లోకెళితే.. దొరగర్ల రాజయ్య (50) అనే టీఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్ శుక్రవారం అర్థరాత్రి గోదావరిఖనిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఉదయం బస్టాండ్ కాలనీలోని తన ఇంట్లో రాజయ్య ఉరివేసుకుని కనిపించడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజయ్య.. ఐదు నెలల క్రితం హైదరాబాద్‌లోని జేబీఎస్‌ డిపోకు బదిలీ అయ్యాడు. రాజయ్య తన కుటుంబాన్ని హైదరాబాద్‌కు తరలించి ప్రగతినగర్ ప్రాంతంలో ఉంటున్నాడు.

హైదరాబాద్‌లో పనిచేయడం ఇష్టం లేక‌ నవంబర్ 23న గోదావరిఖని డిపో అధికారులను ఆశ్రయించి మళ్లీ గోదావరిఖనికి బదిలీ చేయాలని అభ్యర్థించాడు. కొన్ని నెలలపాటు జేబీఎస్‌ లో కొనసాగాలని అధికారులు చెప్ప‌డంతో కలత చెందాడు. గత మూడు రోజుల నుండి గోదావరిఖనిలోనే ఉన్న రాజయ్య శుక్ర‌వారం రాత్రి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. భార్య రజిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజ‌య్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్ర‌భుత్వ‌ ఆస్పత్రికి తరలించారు.


Next Story