రైలు పట్టాలపై శవమై కనిపించిన వ్యక్తి.. నలుగురు పోలీసుల సస్పెండ్

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలోని మాణిక్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ నుండి పారిపోయిన వ్యక్తి రైలు పట్టాలపై శవమై కనిపించాడు.

By అంజి  Published on  16 July 2024 5:15 PM IST
UttarPradesh, police station, cops suspended, Crime

రైలు పట్టాలపై శవమై కనిపించిన వ్యక్తి.. నలుగురు పోలీసుల సస్పెండ్

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలోని మాణిక్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ నుండి పారిపోయిన వ్యక్తి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. బాధితురాడి కుటుంబం ఆగ్రహం, నిరసనలతో, మాణిక్‌పూర్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌తో సహా నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆదివారం సాయంత్రం ముహర్రం ఊరేగింపులో మద్యం మత్తులో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు రావడంతో అన్షు (27)ని మాణిక్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే, అతన్ని తీసుకొచ్చిన కొద్ది నిమిషాలకే అన్షు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. సోమవారం రాత్రి రైలు పట్టాలపై అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

అయితే పోలీసులు దానిని అన్‌క్లెయిమ్డ్ బాడీగా ప్రకటించి, గుర్తింపు కోసం చనిపోయిన వ్యక్తి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు మృతదేహం అన్షుది అని గుర్తించి, మాణిక్‌పూర్ స్టేషన్‌లోని పోలీసులందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని రోడ్లను దిగ్బంధించి నిరసన తెలిపారు. దీంతో తీవ్ర ఒత్తిడి రావడంతో మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి 7 గంటలకు అన్షును ఈ-రిక్షాపై అక్కడికి తీసుకొచ్చినట్లు పోలీసు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలో తేలింది.

తొమ్మిది నిమిషాల్లోనే స్టేషన్‌ నుంచి బయటకు పరుగులు తీయడం కనిపించింది. పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది యువకుడిని కనుగొనడానికి తక్షణమే ప్రయత్నించలేదని, నలుగురు పోలీసులను సస్పెండ్ చేశామని పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. సస్పెండ్ అయిన పోలీసులలో ఎస్‌హెచ్‌ఓ వినోద్ శుక్లా, హెడ్ కానిస్టేబుల్ వీర్ సింగ్, కానిస్టేబుళ్లు ప్రమోద్ పాశ్వాన్, అంకిత్ రాజ్‌పుత్ ఉన్నారు. వారిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినప్పుడు, అతని రాకను జనరల్ డైరీలో నమోదు చేయలేదని అరుణ్ కుమార్ సింగ్ చెప్పారు. దర్యాప్తులో తేలిన వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సింగ్ చెప్పారు.

Next Story