సంగారెడ్డి జిల్లా కొల్కూర్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఈ వరుస ఘటనలు పోలీసులు, గ్రామస్తులకు నిద్ర పట్టకుండా చేస్తోంది. గత పదిహేను రోజుల వ్యవధిలో రాత్రి వేళల్లో ఎనిమిది ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనల కారణంగా గ్రామస్తులు తమ ఇంటి ఆవరణలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గ్రామంలోని ప్రధాన రహదారిపై 14 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొదటి సంఘటన జరిగిన 20 రోజులకు కూడా ఈ పని చేసిన వారిని గుర్తించలేకపోయారు పోలీసులు. గ్రామస్తుల నుంచి పలుమార్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించినా ఇప్పటి వరకు కేసును చేధించలేకపోయారు.
పోలీసులు స్థానిక యువకుల సహకారంతో స్వచ్ఛందంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 9.45 గంటల సమయంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి బైక్‌కు కూడా నిప్పంటించారు. గ్రామంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకోలేదని గ్రామస్తులు తెలిపారు. అనుమానితుల కదలికలపై నిఘా ఉంచామని సదాశివపేట ఇన్‌స్పెక్టర్ మహేష్ గౌడ్ తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.