అల్లుడిని హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టిన మామ‌

జనగామ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

By Medi Samrat  Published on  9 Aug 2023 6:08 PM IST
అల్లుడిని హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టిన మామ‌

జనగామ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అల్లుడిని హత్య చేసిన మేనమామ ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో అతడిని పాతిపెట్టాడు. మద్యం సేవించి కూతురిని వేధించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన చింతా అబ్బసాయికి ముగ్గురు కుమార్తెలు. అందరికీ పెళ్లి చేశాడు. కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన తన అక్క కుమారుడు రామిండ్ల నాగరాజుతో రెండో కుమార్తె శైలజకు వివాహం చేశాడు. కొడుకులు లేకపోవడంతో నాగరాజ్‌ను అల్లుడిగా ఇల్లరికం తెచ్చుకున్నాడు. నాగరాజు-శైలజ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. పలుమార్లు దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసేవారు. ఈ నెల 7వ తేదీన రాత్రి 10 గంటల ప్రాంతంలో నాగరాజు బాగా తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు. అతడికి అన్నం పెట్టేందుకు వచ్చిన భార్య వేలిని నాగరాజ్ బలంగా కొరికాడు. దీంతో ఆమెకు గాయం అయింది. ఇది చూసిన శైలజ తండ్రి అబ్బసాయి ఆగ్రహానికి గురై నాగరాజ్ చెంపపై బలంగా కొట్టాడు. దీంతో మేనమామ ఒంటిపై ఉన్న కండువాతో నాగరాజు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. మేనమామ అబ్బసాయి కూడా అల్లుడు మెడలో కండువాను గట్టిగా బిగించాడు. ఈ గొడవ పెద్దదై.. నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు.

ఆందోళన చెందిన తండ్రి, కూతురు అతడి మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో తలకిందులుగా పాతిపెట్టారు. మరుసటి రోజు అబ్బసాయి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలను కలిశాడు. వారి సూచన మేరకు కూతురితో సహా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టిన నాగరాజు మృతదేహాన్ని బయటకు తీశారు. నాగరాజు కాళ్లు, చేతులు చీరతో కట్టి ఉండడంతో పాటు తలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Next Story