కోటాలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

రాజస్థాన్ కోటాలో ఆదివారం మరో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది.

By అంజి  Published on  28 Aug 2023 7:13 AM GMT
Two students, suicide, Rajasthan, Kota, Crime news

కోటాలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

రాజస్థాన్ కోటాలో ఆదివారం మరో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఏడాది ఆగస్ట్‌ నెల మొదటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులకు ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలోని లతూర్‌కు చెందిన 16 ఏళ్ల ఆవిష్కర్ సంభాజి ఆదివారం కాస్లే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెస్ట్ రాసేందుకు వెళ్లాడు. ఆ తర్వాత 3.15 గంటలప్పుడు ఇన్‌స్టిట్యూట్ ఆరవ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. ఆవిష్కర్ సంభాజి చనిపోయిన 3 గంటల తర్వాత, సాయంత్రం 7 గంటలకు మరో విద్యార్థి చనిపోయినట్లు తెలిసింది.

బిహార్‌కి చెందిన 18 ఏళ్ల ఆదర్ష్ తన రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నీట్ కోచింగ్ కోసం నాలుగు నెలల క్రితం కోటాకు వచ్చిన ఆదర్ష్.. తన తోబుట్టువులతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. సాయంత్రం ఆహారం కోసం కాల్ చేసినప్పుడు ఎలాంటి స్పందన రాకపోవడంతో, డోర్ పగలగొట్టి చూడగా, ఆదర్ష్ ఉరివేసుకున్నట్లు గుర్తించారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆదర్ష్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన టెస్ట్‌లో తక్కువ మార్కులు రావడంతో, వీరు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీంతో 2 నెలల పాటు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ల టెస్ట్‌లపై నిషేధం విధించారు. టెస్ట్‌లు నిర్వహించడం ఆపివేయాలని జిల్లా కలెక్టర్ ఓపీ బంకర్ ఆదేశాలు జారీ చేశారు.

Next Story