వాగులో మునిగి ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి
ఇద్దరు వైద్య విద్యార్థులు వాగులో మునిగి మృతి చెందారని, మరో విద్యార్థి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 23 Sept 2024 11:30 AM ISTఇద్దరు వైద్య విద్యార్థులు వాగులో మునిగి మృతి చెందారని, మరో విద్యార్థి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అల్లూరి సీతారామ రాజు (ASR) జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ మారేడుమిల్లిలోని జలతరంగిణి జలపాతం వద్ద ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఐదుగురు మెడికోలు కొట్టుకుపోయారని, వారిలో ఇద్దరిని పోలీసులు, అటవీ అధికారులు వెంటనే రక్షించారు. అయితే మరో ముగ్గురిని రక్షించలేకపోయారు.
ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరు మృతి చెందగా సోమవారం ఉదయం వారి మృతదేహాల్ని వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ఆదివారం ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని దిగారు. ఈ క్రమంలో భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు. హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడారు. కొసిరెడ్డి సౌమ్య, బి.అమృత, సీహెచ్ హరదీప్ కొట్టుకుపోయారు.
"మేము సోమవారం ఉదయం 7 గంటలకు ఇద్దరు మహిళా వైద్య విద్యార్థుల మృతదేహాలను కనుగొన్నాము. ఇంకా మూడవ విద్యార్థిని కనుగొనలేదు. అతని కోసం NDRF బృందాలు వెతుకుతున్నాయి" అని అధికారులు తెలిపారు. కొసిరెడ్డి సౌమ్య (21) ది పార్వతీపురం జిల్లా బొబ్బిలి స్వస్థలంకాగా, బి.అమృత (21) బాపట్లగా పోలీసులు తెలిపారు. సీహెచ్ హరదీప్(20) ప్రకాశం జిల్లా మార్కాపురంగా తెలుస్తోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తూర్పు కనుమలలోని మారేడుమిల్లి ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యార్థులు ప్రవాహంలో కొట్టుకుపోయారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.