కేరళ రాష్ట్ర శబరిమల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇడుక్కి పెరువంతనం అమలగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు శబరిమల యాత్రికులు మృతి చెందారు. మృతులు కర్నూలుకు చెందిన ఆది నారాయణ, ఈశ్వరప్పగా గుర్తించారు. టెంపోను రోడ్డు పక్కన నిలిపి టీ తాగు తుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు యాత్రికులపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రయాణికులను బస్సు ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టకుండా ఉండేందుకు బస్సును కట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో అక్కడే కారులో ఉన్న మలయాళీ దంపతులు అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు జిల్లా బుధవారపేటకు చెందిన ఇద్దరు అయ్యప్ప స్వామి భక్తులు ఆదినారాయణ, శంకర్ మృతి చెందారు. మరో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారని తెలిసింది. మృతులు బుధవారపేట, దేవనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. శబరిమలకు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల అయ్యప్ప సన్నిధికి టెంపో వాహనంలో వెళ్తుండగా ఈ దర్ఘటన జరిగింది. ఈ సమాచారాన్ని కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు తెలియజేశారు. దీంతో ఈ ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మృతి చెందిన అయ్యప్ప భక్తుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.