Hyderabad : వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ లోని వనస్థలిపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 26 Feb 2025 8:45 PM IST
హైదరాబాద్ లోని వనస్థలిపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు ముషీరాబాద్‌కు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ (48), హఫీజ్‌పేటకు చెందిన సయ్యద్ గౌస్ (40)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్మాయిల్, గౌస్, సయీద్, సులేమాన్‌లు పండ్లు కొనుగోలు చేసేందుకు ఆటోరిక్షాలో హయత్‌నగర్‌లోని హోల్‌సేల్ పండ్ల మార్కెట్‌కు వెళ్లి తిరిగి హైదరాబాద్ నగరానికి వస్తున్నారు.
ఇస్మాయిల్ ఆటోరిక్షా నడుపుతుండగా గౌస్ పక్కనే కూర్చున్నాడు. వారు సుష్మా థియేటర్ రోడ్ వద్దకు రాగానే, గుర్తు తెలియని వాహనం ఆటోరిక్షాను వెనుక నుండి ఢీకొట్టింది. గౌస్, ఇస్మాయిల్ వాహనం నుండి ఎగిరి పడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటోరిక్షాను ఢీకొన్న వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.