అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లాగన్‌లో ఆరు నుంచి ఏడేళ్ల వయసున్న నలుగురు బాలికలపై వారి ప్రైవేట్ ట్యూషన్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 9:15 గంటల ప్రాంతంలో నహర్లగన్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. నలుగురు 1వ తరగతి విద్యార్థినులపై ట్యూషన్ టీచర్ అత్యాచారం చేశాడని ఆరోపించారు.
రిపోర్టు అందుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎ డిర్చి నేతృత్వంలోని పోలీసు బృందం నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కేసును ఇటానగర్ మహిళా పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. నిందితుడిని 35 ఏళ్ల మిలో టక్కర్‌గా గుర్తించారు. నిందితుడు దిగువ సుబంసిరి జిల్లా బులా గ్రామానికి చెందినవాడు.
నహర్లాగన్‌లోని జి-సెక్టార్‌లోని అతని అద్దె ఇంట్లో ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. నిందితుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోంది.