తిరుమల యాత్రలో విషాదం..రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

చిత్తూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

By -  Knakam Karthik
Published on : 28 March 2026 3:35 PM IST

Crime News, Telugu States News, Andrapradesh, Telangana,  Chittoor Accident, Road Tragedy, Warangal Family

తిరుమల యాత్రలో విషాదం..రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

చిత్తూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం సమీపంలోని తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ విషాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను వరంగల్‌కు చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, కుమార్తె ఆద్వికగా పోలీసులు గుర్తించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ కుటుంబం బెంగళూరు నుండి తిరుమల శ్రీవారి దర్శనం కోసం కారులో బయలుదేరారు. మార్గమధ్యలో శేషాపురం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారు అతివేగంతో ఉండటమే ప్రమాద తీవ్రతకు కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న బంగారుపాళ్యం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించామని, కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోగా, క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

Next Story