కర్ణాటక: బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కేరళలోని కాలికట్ నుండి బెంగళూరు వస్తున్న ప్రైవేట్ బస్సు, చన్నపట్న సమీపంలోని పుట్టప్పనదొడ్డి వద్ద నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ఇనుప రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులను కేరళకు చెందిన మహమ్మద్ ఫరాన్ (22), సుల్ఫీ (45) మరియు బెంగళూరుకు చెందిన రషీద్ (45), సాకిర్ (27)గా పోలీసులు గుర్తించారు.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో బస్సు అదుపుతప్పి, సర్వీస్ రోడ్డును వేరు చేసే రెయిలింగ్‌ను సుమారు 100 మీటర్ల మేర రాసుకుంటూ వెళ్ళింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ వాదించినప్పటికీ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అది డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106 కింద కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.