నెల్లూరులో విషాదం.. రైలు ఢీ కొని ముగ్గురు మృతి
Tragedy in Nellore three killed after being hit by a train.నెల్లూరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 22 Jan 2023 8:01 AM ISTనెల్లూరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి రైలు ఢీ కొని ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది.
స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నున్న రైల్వే బ్రిడ్జిపై ముగ్గురిని గూడూరు నుంచి విజయవాడ వెలుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. మృతుల్లో ఇద్దరు పురుషులు కాగా.. ఓ మహిళ కూడా ఉంది.
మహిళను రైలు ఢీ కొట్టడంతో ఆమె అండర్ పాస్ ఓవర్ బ్రిడ్జీపై నుంచి కింద పడింది. ఆ సమయంలో అటుగా వెలుతున్న వాహన దారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే వారు బ్రిడ్జి పైకి వెళ్లి చూడగా ట్రాక్‌పై ఇద్దరు పురుషుల మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్రాక్‌పై చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతుల వయస్సు 45 నుంచి 50 మధ్య ఉంటుందని బావిస్తున్నారు. మృతుల వద్ద ఉన్న సంచులను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారా..? లేదా బంధువులా అనేది ఇంకా తెలియరాలేదు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఆ సంచుల్లో టీటీడీ లాకర్ అలాట్‌మెంట్ టికెట్లు ఉన్నట్లు గుర్తించారు. దాంతో పాటు ఓ ఫోన్ నెంబరు కూడా ఉంది. అయితే.. ఆఫోన్‌ని కాల్ చేయగా ఎవరూ స్పందించడం లేదు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరు ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు చనిపోయారా..? లేదా ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.