మెదక్ జిల్లా కుల్చారం మండలం రంగంపేట గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ ఢీకొనడంతో పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు తొమ్మిదో తరగతి చదువుతున్న శివపల్లి జస్వంత్ (15), ఎనిమిదో తరగతి చదువుతున్న తూర్పట్ల రజనీకాంత్ (13) కాగా, గాయపడిన విద్యార్ధినిని రామ్ చరణ్ గా గుర్తించారు.
జిల్లా పరిషత్ హైస్కూల్ రంగంపేట నుంచి సాంఘిక సంక్షేమ వసతి గృహానికి ముగ్గురూ విద్యార్ధులు వెళ్తుండగా.. వారిపై నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. జస్వంత్ అక్కడికక్కడే మృతిచెందగా, రజనీకాంత్ మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంట తర్వాత మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చరణ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కుల్చారం పోలీసులు కేసు నమోదు చేశారు.