పూణే: ప్రియుడి టార్చర్‌తో విసిగిపోయిన ఓ వివాహిత రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకుంది. హడప్సర్ పోలీసులు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఉరులి కంచన్ ప్రాంతానికి చెందిన విక్రాంత్ దశరత్ జగ్తాప్ (38)గా గుర్తించారు. ఈ సంఘటన జూలై 14, 2022న హండేవాడి, మంజరి మధ్య రైల్వే లైన్‌లో జరిగింది. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సుశీల్ దామ్రే హడప్సర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకున్న మహిళను బీడుకు చెందిన తారామతి (38)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజరి-హందేవాడి మధ్య రైల్వే లైన్‌పై ఓ మహిళ గాయపడినట్లు గుర్తించారు. ఆమెను సాసూన్ ఆస్పత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీనిపై పోలీసులు ఆమె బంధువులను ఆరా తీశారు. తారామతి వివాహానంతరం తన భర్తను విడిచిపెట్టి 2016 నుండి విక్రాంత్ జగ్తాప్‌తో సహజీవనం చేస్తూ వచ్చింది. విక్రాంత్ ఆమెను కొట్టడం, మానసికంగా వేధించడం, తిండి కూడా పెట్టకుండా చేయడం వంటివి చేసేవాడు. కొద్దిరోజుల కిందట తారామతి.. విక్రాంత్ జగ్తాప్ ఆటో రిక్షాలో నుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ప్రాణాలతో బతికి బయటపడిన ఆమె తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు ఈ ఘటనను ఇన్వెస్టిగేట్ చేశారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. విక్రాంత్ జగ్తాప్ వేధింపుల వల్లే తారామతి రైలు కింద దూకి చనిపోయిందని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి ఎట్టకేలకు విక్రాంత్ జగ్తాప్‌ను అరెస్టు చేశారు.