కత్తులతో దుండగుల దాడి.. కూతురు మృతి, తల్లికి తీవ్ర గాయాలు

Thugs attack mother and daughter in Karimnagar district. అర్ధరాత్రి ఆ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. దుండగులు ఒక్కసారిగా ఇంటి మీదకు వచ్చి కత్తులతో దాడి చేశారు.

By అంజి  Published on  7 Oct 2022 9:46 AM IST
కత్తులతో దుండగుల దాడి.. కూతురు మృతి, తల్లికి తీవ్ర గాయాలు

అర్ధరాత్రి ఆ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. దుండగులు ఒక్కసారిగా ఇంటి మీదకు వచ్చి కత్తులతో దాడి చేశారు. దీంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ దారుణం కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండలంలోని రామకృష్ణ కాలనీలో తల్లీకూతుళ్లపై దుండగులు కత్తులతో దాడి చేశారు. కాలనీకి చెందిన బాలవ్వ, సులోచన తల్లీ కూతుళ్లు. గురువారం రాత్రి సమయంలో ఇద్దరు ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు.

తల్లీకూతుళ్లపై కత్తితో దాడికితెగబడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన కూతురు సులోచన అక్కడికక్కడే మృతిచెందింది. తల్లి బాలవ్వ రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడిపోయింది. ఇది గుర్తించిన స్థానికులు బాలవ్వను.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సులోచన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూతగాదాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు అంటున్నారు.

Next Story