ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనపురం క్రాస్ వద్ద హైవేపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. వీరంతా కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను అలివేలమ్మ (45), ఆదిలక్ష్మమ్మ (65), శాకమ్మ (60)గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులను రొద్దం మండలం దొడగట్ట వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.