చలికాలం కారణంగా గదిలో వెచ్చదనం కోసం మంట రాజేసి ఒక కుటుంబం నిద్రించింది. అయితే ఊహించని ఈ పరిణామం కారణంగా ప్రాణాలే పోయాయి. విష వాయువులు వెలువడంతో ఒక వృద్ధురాలు, ముగ్గురు పిల్లలు మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. బీహార్‌లోని చాప్రా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
చాప్రాకు చెందిన ఒక కుటుంబం రాత్రి వేళ గదిలో వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటి వెలిగించారు. తలుపులు, కిటికీలు మూసేసి ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఆ గదిలో నిద్రించారు. తెల్లవారుజామున కింది అంతస్తులో నివసించే బంధువులు పైకి వెళ్లి చూశారు. ఆ గదిలో ఉన్న వారి పరిస్థితి చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. మూడేళ్ల తేజాంష్ కుమార్, ఏడు నెలల గుడియా కుమారి, ఆదియా కుమారి, 70 ఏళ్ల కమలావతి దేవి అప్పటికే మరణినంచినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 25 ఏళ్ల ఆర్య కుమారి, 24 ఏళ్ల ఆర్య సింగ్, 25 ఏళ్ల అనిషా, 35 ఏళ్ల అమిత్ అలియాస్ సోనుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.