ఎర్రకోట సమీపంలో కాల్పుల కలకలం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Three held for opening fire at public near Red Fort. ఉత్తర ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతానికి సమీపంలోని అంగూరీ బాగ్‌లో కాల్పుల కలకలం రేగింది.
By Medi Samrat Published on 2 Feb 2022 2:34 PM GMT
ఉత్తర ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతానికి సమీపంలోని అంగూరీ బాగ్‌లో కాల్పుల కలకలం రేగింది. ప్రజలపై కాల్పులు జరిపినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయని.. వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులను షెహజాదా ఫరీద్ (30), షాదాబ్ (31), షాబాజ్ అలియాస్ బాద్షా (30)గా గుర్తించారు. వీరంతా ఈశాన్య ఢిల్లీలోని న్యూ సీలంపూర్‌లోని చౌహాన్ బంగర్‌లో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి దేశంలోనే తయారైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం రాత్రి షాహిద్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు నిందితులు ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. షాహిద్ మోటారు సైకిల్ స్వల్పంగా దెబ్బతినడంతో.. దానిని బాగు చేయించాలని నిందితులని డిమాండ్ చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో షాదాబ్ రివాల్వర్‌ను బయటకు తీసి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక రౌండ్ గాలిలో, నాలుగు రౌండ్లు ప్రజలపైకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ఆబిద్, అమన్, దిల్ఫరాజ్ లు గాయపడ్డారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో నిందితులను గుర్తించేందుకు సహాయపడిందని పోలీసులు తెలిపారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్, ఆయుధాల చట్టం ప్రకారం హత్యాయత్నం (307) కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు.