తనపై అత్యాచారం జరిగిందని కథ అల్లింది.. తీరా విచారణ చేస్తే..
The story is that she was raped. తనపై అత్యాచారం జరిగిందని కథ అల్లిందో విద్యార్థిని.
By Medi Samrat Published on 1 March 2021 2:15 PM IST
ఆడవారి మీద అరాచకాలు పెరిగిపోతూ ఉండడం మన దౌర్భాగ్యం. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నా కూడా కొన్ని చోట్ల దారుణాలు జరిగిపోతూ ఉన్నాయి. లైంగిక వేధింపులు కూడా సర్వ సాధారణమవుతూ ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని సార్లు లైంగిక వేధింపుల విషయంలో అబద్ధాలు కూడా చెబుతూ వస్తున్నారు. నిజంగానే ఘటన జరిగిందా అని పోలీసులు నిద్రాహారాలు మాని మరీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే.. కొన్ని కొన్ని సార్లు బాధిత యువతులు చెప్పిందంతా అబద్ధమని తేలుతోంది .
తనపై అత్యాచారం జరిగిందని కథ అల్లిందో విద్యార్థిని. కానీ వైద్య పరీక్షల అనంతరం ఆమె చెబుతున్నది అబద్ధమని తేలింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించగా, ఆమె చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. హోం వర్క్ నుండి తప్పించుకోడానికి ఇలా ఆమె చేసిందని పోలీసులు కనుగొన్నారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపుర తాలూకా నందొళ్లి గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. గత బుధవారం పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఈ క్రమంలో గ్రామ సమీపంలోని అడవిలో బాలిక కనిపించింది. ఆమెను రక్షించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలికను ప్రశ్నించగా తనను ముగ్గురు దుండగులు అపహరించారని, ఆపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. వైద్య పరీక్షల్లో మాత్రం అత్యాచారం జరగలేదని తేలింది. దీంతో బాలికను గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం చెప్పింది. హోం వర్క్ చేయలేదని, దాని నుంచి తప్పించుకునేందుకే ఈ నాటకం ఆడినట్టు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అత్యాచారం అనే విషయాన్ని ఇలాంటి వాటికి కూడా వాడుకుంటూ ఉన్నారని.. తప్పనిసరిగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందేనని నిపుణులు చెబుతూ ఉన్నారు.