టీవీ సౌండ్ పెరగడంపై జరిగిన గొడవలో 60 ఏళ్ల మహిళపై కోడలు దాడి చేసింది. 32 ఏళ్ల కోడలు.. తన అత్త కుడి చేతి మూడు వేళ్లను కొరికింది. టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త కుడి చేతి మూడు వేళ్ళను కొరికేసిన ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లా అంబర్ నాథ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై అత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అంబర్‌నాథ్‌లోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కోడలుపై కేసు నమోదు చేసినప్పటికీ ఇంకా అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు.
అంబర్‌నాథ్ (తూర్పు)లోని వడ్వాలి ప్రాంతంలో అత్త స్తోత్రాలు చదువుతూ ఉండగా.. ఆమె కోడలు బిగ్గరగా సౌండ్ ను పెట్టుకొని టెలివిజన్‌ని చూస్తూ ఉంది. సౌండ్ తగ్గించాలనే గొడవ ఇద్దరి మధ్య మొదలైంది. సౌండ్ తగ్గించమని అత్త తన కోడలిని కోరగా, ఆమె నిరాకరించడంతో, కోపోద్రిక్తులైన అత్త టీవీని స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో గొడవ మరింత పెద్దదై కోడలు ఏకంగా వేళ్లు కొరికేదాకా వెళ్ళిపోయింది.
అంబర్‌నాథ్ (ఈస్ట్)లోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ భగత్ మాట్లాడుతూ.. అంబర్‌నాథ్ ప్రాంతంలోని శివాజీ నగర్‌కు చెందిన 60 ఏళ్ల మహిళ మూడు వేళ్లను కొరికినట్లు మాకు ఫిర్యాదు అందింది. తన కోడలే నిందితురాలని ఆమె చెప్పింది. కోడలు కోపంతో అత్తగారి కుడిచేతి మూడు వేళ్లను కొరికి తీవ్రంగా గాయపరిచింది. అత్తని వైద్యం కోసం పంపించి, కోడలుపై కేసు నమోదు చేశాం. గత కొన్నేళ్లుగా అత్త, కోడలు మధ్య కేసు కోర్టులో నడుస్తుండడంతో కుటుంబ కలహాల వ్యవహారంగా అనిపిస్తోంది.. ఇంకా కోడలిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.