మహారాష్ట్రలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. థానే జిల్లాలోని భివాండి తాలుకాలో ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు 40 ఏళ్ల వ్యక్తి. ఈ ఘటన ఆదివారం నాడు చోటు చేసుకోగా.. నిందితుడిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాల్ఘర్ జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రులు ఇటుక బట్టీలో పని చేస్తుంటారని పోలీసులు తెలిపారు. బాలిక నిందితుడి ఇంటిలో పని చేస్తోందని.. ఈ క్రమంలోనే ఆదివారం నాడు బాలికను పాల్ఘర్‌లోని తల్లిదండ్రులకు దగ్గరికి తీసుకెళ్తానని నమ్మించాడని పోలీసులు వివరించారు. ఆ తర్వాత బైక్‌పై బాలికను ఎక్కించుకుని వెళ్లాడని.. అంగావ్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత బాలికను ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
బాలిక ప్రతిఘటించింది. దీంతో నిందితుడు బాలికను తీవ్రంగా కొట్టాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బాలికను హెచ్చరించాడు. అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత బాలికను ఆమె ఇంటి వద్ద విడిచిపెట్టాడు. బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు ఓ ఎన్జీవో సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో, ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల బాధితురాలిని భివాండిలోని పిల్లల గృహానికి పంపినట్లు పోలీసులు తెలిపారు.