ములుగు జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం వ్యాను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ములుగు మండలం ఎర్రిగట్టమ్మ దగ్గర జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల్లో ఆటో డ్రైవర్, ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
గాయపడిన వారిని వెంటనే వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ఇద్దరు మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారని పోలీసులు చెప్పారు. మృతులను మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు ఆటో డ్రైవర్ జానీ (23), కౌసల్య (60), కిరణ్ (16), అజయ్ (12). వసంత, రసూల్, పద్మ, వెన్నెలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.