కోలాటం ఆడుతూ కుప్పకూలిన మహిళ
బాగా యాక్టివ్ గా ఉన్న వ్యక్తులు కుప్పకూలి మరణించిన ఉదంతాలను మనం చూసే ఉన్నాం.
By Medi Samrat Published on 16 Jan 2024 6:49 PM ISTబాగా యాక్టివ్ గా ఉన్న వ్యక్తులు కుప్పకూలి మరణించిన ఉదంతాలను మనం చూసే ఉన్నాం. తాజాగా సంక్రాంతి సంబరాల్లో ఎంతో యాక్టివ్ గా పాల్గొన్న ఓ మహిళ కుప్పకూలి మరణించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హుజూరాబాద్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఒక మహిళ కుప్పకూలి మరణించింది. తెలంగాణలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోలాటం ఆడేందుకు కొందరు మహిళలు తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోలాటాన్ని స్థానిక ప్రజలు తమ ఫోన్‌లతో రికార్డు చేస్తూ ఉండగా.. ఆ మహిళ కుప్పకూలి పడిపోవడం రికార్డు అయింది.
కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఇటీవలి కాలంలో తెలంగాణలో పలువురు మరణించిన ఘటనలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. 14 ఏళ్ల విద్యార్థి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతులకు హాజరవుతుండగా ఛాతీలో నొప్పి ఉన్నట్లు చెప్పాడు. ఉపాధ్యాయులు అతడిని ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు. ఇప్పుడు హుజూరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తూ ఉంది.