తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పోలీసు కాన్వాయ్‌లోని కారు ఢీకొనడంతో 55 ఏళ్ల వ్యక్తి మరణించాడు. సోమవారం మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లకల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని నరసింహా రెడ్డిగా గుర్తించారు. మృతుడు గ్లోబల్ అల్యూమినియం కంపెనీ యూనిట్-1 లో పని చేస్తున్నాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామ నివాసి. 30 సంవత్సరాలుగా కల్లకల్ లో ఉంటున్న అతనికి భార్య, పిల్లలు ఉన్నారు.
ఎస్పీ చందన దీప్తి న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ.. నరసింహారెడ్డి అక్కడికక్కడే మరణించినట్లు ధృవీకరించారు. అతను రోడ్డు దాటుతున్నప్పుడు వేగంగా వచ్చిన వాహనం అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. ఐపిసి సెక్షన్ 304 (ఎ) సెక్షన్ కింద కాన్వాయ్ డ్రైవర్ తాటిపాముల వెంకట స్వామిపై కేసు నమోదయ్యింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్పీకర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మరో వాహనంలో ఉన్న స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి దిగి, నరసింహా రెడ్డిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే అతను చనిపోయాడు. ఈ ఘటనపై స్పీకర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.