కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. ఏ క‌ష్ట‌మొచ్చిందో..!

దేశంలోనే కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన కోటాలో ఓ విద్యార్థి రైలు కింద‌ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

By -  Medi Samrat
Published on : 27 Jan 2026 8:57 AM IST

కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. ఏ క‌ష్ట‌మొచ్చిందో..!

దేశంలోనే కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన కోటాలో ఓ విద్యార్థి రైలు కింద‌ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానాలోని సిర్సా జిల్లా హిమాయున్ ఖేడా గ్రామ నివాసి అయిన‌ సర్తాజ్ సింగ్ అనే విద్యార్థి బ‌ల‌వంతంగా ప్రాణం తీసుకున్నాడు. గత రెండేళ్లుగా కోటాలో ఉంటూ జేఈఈ (ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష)కు సిద్ధమవుతున్నాడు. ఆదివారం రాత్రి ఢిల్లీ-ముంబై రైల్వే ట్రాక్‌పై ఈ ఘటన జరిగినట్లు కోటలోని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విద్యార్థి ప్రైవేట్ హాస్టల్‌లో నివాసం ఉండేవాడు. అత‌డు జేఈఈకి ప్రిపేర్ కావడంతో పాటు 12వ తరగతి కూడా చదువుతున్నాడు. సర్తాజ్ తండ్రి కులదీప్ సింగ్ గ్రామంలో వ్యవసాయం చేస్తుంటాడు.

విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలోనే ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని గ‌తంలో రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గ‌త‌ సంవత్సరం మే లో ఆత్మహత్యలపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఒక రాష్ట్రంగా మీరేం చేస్తున్నారు? పిల్లలు కేవలం కోటాలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకొంటున్నారు? ఒక ప్రభుత్వంగా మీరు దీని గురించి ఆలోచించలేదా?’ అని జస్టిస్‌ పార్థీవాలా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. విద్యార్ధుల వ‌రుస‌ ఆత్మహత్య కేసుల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Next Story