నవీన్ హ‌త్య‌ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి

అబ్దుల్లాపూర్ మెంట్‌లో జ‌రిగిన నవీన్ హ‌త్య‌ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2023 8:14 AM IST
నవీన్ హ‌త్య‌ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి

ఆ ఇద్ద‌రూ ఇంట‌ర్ నుంచి మంచి స్నేహితులు. అయితే.. ఒకే అమ్మాయిని ఇష్ట‌ప‌డ్డారు. తాను ప్రేమించిన అమ్మాయిపై స్నేహితుడు మ‌న‌సు ప‌డ్డాడ‌ని ప‌గ‌తో ర‌గిలిపోయాడు. ఆమె త‌న‌కు దూరం అవుతుంద‌న్న‌ కోపంతో గెట్ టు గెద‌ర్ పార్టీ అంటూ పిలిచి ప్రాణ స్నేహితుడిని అత్యంత కిరాత‌కంగా హ‌త‌మార్చాడు. అంత‌టితో ఆగ‌కుండా త‌ల, మొండెం వేరు చేశాడు. గుండెను చీల్చాడు, చేతి వేళ్ల‌ను, మ‌ర్మాంగాన్ని కోశాడు. ఫోటోలు తీసి ప్రేమించిన యువ‌తికి పంపించాడు. హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని అబ్దుల్లాపూర్ మెంట్‌లో వెలుగు చూసిన హత్యోదంతంలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

కుటుంబ స‌భ్యులు, పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. నేనావత్‌ నవీన్‌ (22) స్వ‌స్థ‌లం నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ మండలం సిరిసనగండ్ల. ఇత‌డు న‌ల్గొండ‌లోని మ‌హాత్మాగాంధీ విశ్వ‌విద్యాల‌యంలో బీటెక్ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతూ వ‌ర్సిటీ హాస్ట‌ల్లో ఉంటున్నాడు. వరంగల్‌కు చెందిన హరిహరకృష్ణ పీర్జాదీగూడ‌లోని ఓ కాలేజీలో బీటెక్ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు.

వీరిద్ద‌రు దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంట‌ర్ క‌లిసి చ‌దివారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ మంచి స్నేహితులు అయ్యారు. ఇంట‌ర్‌లో ఉన్న‌ప్పుడే న‌వీన్‌ త‌న జూనియ‌ర్ విద్యార్థితో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఈ విష‌యం హ‌రిహ‌ర కృష్ణ‌కు తెలుసు. అయితే.. కొంత‌కాలానికి మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది.

ఇదే స‌మ‌యంలో హ‌రిహ‌ర‌కృష్ణ ఆ యువ‌తికి ద‌గ్గ‌ర అయ్యాడు. అయితే.. ఇటీవ‌ల న‌వీన్ తిరిగి తాను ప్రేమించిన అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడ‌టం, మెసేజ్‌లు పంపడం చేస్తుండేవాడు. దీంతో ఆ యువ‌తి ఎక్క‌డ మ‌ళ్లీ న‌వీన్‌కు ద‌గ్గ‌ర అవుతుందోన‌ని భ‌య‌ప‌డ్డాడు. ఈ విష‌యంపై స్నేహితులు ఇద్ద‌రి మ‌ధ్య ప‌లుమార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. ప్రేమించిన అమ్మాయి ద‌క్కాలంటే న‌వీన్‌ను అడ్డుతొల‌గించుకోవాల‌ని హ‌రిహ‌ర‌కృష్ణ భావించాడు. అందుకు ఓ ప‌థ‌కాన్ని ర‌చించాడు. రెండు నెల‌ల క్రిత‌మే ఓ క‌త్తిని కొన్నాడు.

ఈ నెల 17న ఇంటర్‌ స్నేహితుల గెట్‌ టు గెదర్‌ పార్టీ ఉన్నదని చెప్పి నవీన్‌ను హైదరాబాద్‌కు రప్పించాడు. ఇద్ద‌రు కాసేపు షికార్లు కొట్టారు. న‌వీన్‌ను బైక్‌పై ఎక్కించుకున్న హరిహరకృష్ణ పెద్దఅంబర్‌పేట వద్ద మద్యం తీసుకొని అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. మద్యం తాగిన అనంతరం యువ‌తి విష‌యంలో మ‌రొసారి గొడ‌వ ప‌డ్డారు.

క‌త్తితో న‌వీన్ పై విచ‌క్ష‌ణారహితంగా దాడి చేశాడు. తేరుకునేలోపే గొంతు నులిమి హ‌త‌మార్చాడు. వెంట తెచ్చుకున్న క‌త్తితో న‌వీన్ తల, మొండెం వేరు చేశాడు. చేతివేళ్లు కోసేశాడు. ఛాతిని చీల్చాడు. మ‌ర్మాంగాల‌ను కోసేశాడు. తన ఫోన్‌లో ఫోటోలు తీసి ప్రేయసికి వాట్సాప్‌కు పంపినట్టు సమాచారం.

బ‌య‌ట‌కు వెళ్లిన న‌వీన్ తిరిగి రాక‌పోవ‌డంతో వ‌ర్సిటీలోని అత‌డి స్నేహితులు ఆరా తీశారు. హ‌రిహరకృష్ణతో కలిసి పార్టీ చేసుకొన్నట్టు తెలుసుకుని అత‌డికి ఫోన్ చేయ‌గా.. గొడవ జరగడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లో వదిలిపోయానని హరిహరకృష్ణ చెప్పినట్టు నవీన్‌ స్నేహితులు చెప్పారు. ఈ విష‌యాన్ని వారు నవీన్‌ తండ్రి శంకరయ్య కు తెలిపారు. రెండు మూడు రోజులైన న‌వీన్ రాక‌పోవ‌డంతో అత‌డి తండ్రి శంక‌రయ్య ఈ నెల 22న నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఎలాగైనా ప‌ట్టుబ‌డుతాన‌న్న ఉద్దేశంతో శుక్ర‌వారం రాత్రి హ‌రిహ‌ర‌కృష్ణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

నవీన్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గిరిజన సంఘాల నాయకులు శనివారం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు.

Next Story