సూర్యాపేటలో దారుణం.. భర్త బలవంతంగా అబార్షన్ చేయించడంతో భార్య మృతి
భర్త బలవంతంగా అబార్షన్ చేయించడంతో పరిస్థితి విషమించి భార్య మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది.
By అంజి Published on 3 July 2024 10:15 AM ISTసూర్యాపేటలో దారుణం.. భర్త బలవంతంగా అబార్షన్ చేయించడంతో భార్య మృతి
హైదరాబాద్: భర్త బలవంతంగా అబార్షన్ చేయించడంతో పరిస్థితి విషమించి భార్య మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది. గర్భం దాల్చిన భార్యకు.. భర్త అక్రమంగా లింగనిర్ధారణ పరీక్ష చేయించడంతో, ఆడ పిల్ల అని తెలిసింది. ఈ క్రమంలోనే బలవంతంగా అబార్షన్ చేయించడంతో గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. అక్రమ లింగ నిర్ధారణ పరీక్ష, అబార్షన్ తర్వాత మహిళ మరణించిన కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. అబార్షన్ చేయించుకోమని బలవంతం చేసిన మహిళ భర్త, అరెస్టయిన వారిలో ఓ డాక్టర్ కూడా ఉన్నారు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు సుహాసిని 2019లో రత్నావత్ హరిసింగ్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల సుహాసిని గర్భం దాల్చినప్పుడు.. మరో ఆడపిల్ల పుడితే ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటానని రత్నావత్ చెప్పుకొచ్చాడు. సుహాసినికి కోదాడ్‌లోని గురువయ్య ఆసుపత్రిలో లింగనిర్ధారణ పరీక్ష నిర్వహించగా, ఆమె ఆడ పిండాన్ని మోస్తున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PC-PNDT) చట్టం, 1994 ప్రకారం భారతదేశంలో ప్రినేటల్ లింగ నిర్ధారణ చట్టవిరుద్ధం.
అక్రమ పరీక్ష తర్వాత రత్నావత్ అబార్షన్ కోసం సుహాసినిని హుజూర్‌నగర్‌లోని న్యూ కమలా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అబార్షన్‌ను ప్రేరేపించడానికి డాక్టర్ షేక్ ఖాసిం మాత్రలు వేసాడు, దీని ఫలితంగా సుహాసినికి అధిక రక్త స్రావం జరిగింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. చివ్వెంల పోలీసులు రత్నావత్, డాక్టర్ ఖాసీం, మరో నలుగురిపై పీసీ-పీఎన్‌డీటీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులందరినీ అరెస్టు చేశారు.