వేరే రాష్ట్రం నుండి వచ్చి పలాసలో ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.
By Medi Samrat Published on 18 Nov 2023 12:47 PM GMTశ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. గూడ్స్ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు.మృతులు పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్‌కు చెందిన రంజనా రాయ్, తాషి షేర్పాగా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ నుంచి షాలీమార్ ఎక్స్‌ప్రెస్ లో పలాసకు వచ్చిన వీరిద్దరూ ట్రాక్‌పై పడుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మృతదేహాలను జీఆర్పీ పోలీసులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి, యువకుడి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇద్దరూ బ్యాగులతో పలాస రైల్వే స్టేషన్‌కు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చేరుకున్నారు. రైల్వే ఫ్లాట్‌ఫారంపై ఉన్న డ్రైవర్లు, గార్డుల కంట్రోల్ రూమ్‌వద్ద ఇరువురూ ఫోన్లలో మాట్లాడారు. అందరూ చూస్తుండగానే ఫ్లాట్‌ఫారం కిందకు దిగి ఖుర్ధారోడ్ వైపు వెళ్తున్న గూడ్స్‌రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మహిళ రంజనారాయ్(33), యువకుడు థీరింగ్ టాసిషోర్పా(24) డార్జిలింగ్ వద్ద ఉన్న షమ్ సింగ్, గితుడూబిల్లింగ్ గ్రామాలకు చెందిన వారు. వీరిద్దరూ బ్యాగులతో పలాస రైల్వే స్టేషన్‌కు చేరుకుని షాలీమార్ రైలులో కోల్‌కతా వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నారు.