కొడుకుతో స‌హా హోటల్‌ రూమ్‌లో త‌ల్లిదండ్రుల‌ ఆత్మహత్యాయత్నం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది

By Medi Samrat  Published on  8 Oct 2024 2:14 PM IST
కొడుకుతో స‌హా హోటల్‌ రూమ్‌లో త‌ల్లిదండ్రుల‌ ఆత్మహత్యాయత్నం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలో ఉన్న తాజ్ త్రి స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న ముగ్గురు కుటుంబికులు.. అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఇది గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులను వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి.? అసలు వీరు ఎక్కడి నుండి వచ్చారు.? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు.? అనే కోణంలో మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యకు పాల్ప‌డిన వారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తోట బవన్నారాయణ(51)తో పాటు భార్య పద్మావతి(45). కుమారుడు సుజన్(23)గా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు హోటల్లో రూమ్ బుక్ చేసుకుని.. కూల్ డ్రింక్ లో పురుగుల మందు క‌లిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Next Story