విషాదం.. డాన్స్ చేస్తూ మృత్యువాత పడ్డ విద్యార్ధిని

కరీంనగర్ జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat
Published on : 11 Aug 2023 8:30 PM IST

విషాదం.. డాన్స్ చేస్తూ మృత్యువాత పడ్డ విద్యార్ధిని

కరీంనగర్ జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. స్కూల్లో జరుగుతున్న ప్రోగ్రాంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఓ విద్యార్ధిని.. ఉన్నట్లుండి కింద పడిపోయి మృత్యువాత పడిన ఘటన స్థానికంగా పలువురిని కంటతడి పెట్టించింది. తన స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ బాలికను మృత్యువు కబళించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా లోని ఓ స్కూల్లో చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లా లోని గంగాధర మండలంలోని వెంకటయ్య పల్లి గ్రామానికి చెందిన గుండు అంజయ్య కుమార్తె ప్రదీప్తి. గంగాధర మండలంలోని ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో ప్రదీప్తి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ రోజు ఫ్రెషర్స్ డే సందర్భంగా డాన్స్ చేస్తుండగా.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిప‌డ్డ ప్రదీప్తి.. ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయింది. వెంటనే ఉపాధ్యా యులు ఆమెకు సీపీఆర్‌ చేసి ప్రధమ చికిత్స కొరకు గంగాధర హాస్పిటల్ కి తరలించారు.

అక్కడ వైద్యులు పరీక్షించి ప్రదీప్తి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. అయితే తల్లిదండ్రులు ప్రదీప్తిని కరీంనగర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఉత్సాహంగా ఉన్న‌ కూతురు ఒక్కసారిగా తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story