హైదరాబాద్‌లో దారుణం.. తండ్రిని కొట్టి చంపిన కొడుకు

Son beats sick father to death in Hyderabad. హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిన తండ్రిని కాస్తైనా కనికరం లేకుండా

By అంజి  Published on  12 July 2022 2:57 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. తండ్రిని కొట్టి చంపిన కొడుకు

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిన తండ్రిని కాస్తైనా కనికరం లేకుండా కన్న కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జీడీమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో జరిగింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐదేళ్ల నుంచి సత్యనారాయణ (63) అనే వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నాడు. అతడిని కన్నకొడుకు సురేష్ కొట్టి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జీడీమెట్ల పీఎస్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. వృద్ధుడు (63) సత్యనారాయణ గత ఐదేళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పక్షవాతం కారణంగా మంచానికే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలోనే తండ్రితో కొడుకు సురేష్ గొడవకు దిగాడు. మద్యం తాగొచ్చి కోపంతో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కన్న తండ్రి అన్న విషయం మరిచి కర్రతో, బెల్టుతో సత్యనారాయణను ఇష్టారీతినా కొట్టాడు.

దెబ్బలకు తాళలేక తండ్రి హాహాకారాలు చేస్తున్నా సురేష్ వదిలి పెట్టకపోగా అమానవీయంగా ప్రవర్తించాడు. కొట్టొద్దని తండ్రి ఎంత ప్రాధేయపడినా వదలలేదు. సురేష్ తన తండ్రి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. కొడుకు కొట్టిన దెబ్బలు తాళలేక సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తండ్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కొడుకును అరెస్ట్ చేశారు.

Next Story