ఆన్‌లైన్ అప్పుల‌కు ఐటీ ఉద్యోగి బ‌లి.. "నేను చ‌నిపోతున్నా.. నా జాబ్ వేరే వారికి ఇవ్వండి అంటూ.."

Software Employee Commits Suicide in Hyderabad Over Financial Issues. ఒక్క నిమిషంలో మీకు రుణం ఇస్తాం.. అప్లై చేయండి చాలు

By Medi Samrat  Published on  18 Dec 2020 11:34 AM IST
ఆన్‌లైన్ అప్పుల‌కు ఐటీ ఉద్యోగి బ‌లి.. నేను చ‌నిపోతున్నా.. నా జాబ్ వేరే వారికి ఇవ్వండి అంటూ..

ఒక్క నిమిషంలో మీకు రుణం ఇస్తాం.. అప్లై చేయండి చాలు.. క్ష‌ణాల్లో మీ బ్యాంకు ఖాతాలో డ‌బ్బులు ప‌డిపోతాయి అంటూ ఊరించే ప్ర‌క‌ట‌న‌ల‌కు ఆన్‌లైన్‌లో కొద‌వ‌లేదు. అప్పు తీసుకునే వేళలో కనిపించేవే కానీ.. కనిపించని రూల్స్ ను ప్రత్యేకంగా పట్టించుకోని వారికి నరకం అంటే ఏమిటో కనిపిస్తుంది. తాజాగా వారి బారిన పడిన ఒక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే ఒక మహిళ సూసైడ్ చేసుకోగా..తాజాగా మరొకరు ఈ ఆన్ లైన్ అప్పులకు బలయ్యారు.

వివ‌రాల్లోకి వెళితే.. గుంటూరు మంగళ గిరికి చెందిన సునీల్‌(29) హైదరాబాద్‌ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, ఆరునెలల కూతురుతో కలిసి రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. క‌రోనా నేప‌థ్యంలో అత‌డి ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌కు గుర‌య్యాడు. ప‌లు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రూ.50వేలు అప్పు చేశాడు. 30 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు ఇటీవల అతడిపై తీవ్ర ఒత్తిడి చేశారు. వీటితో పాటు సునీల్‌కు వ్యక్తిగతంగా మరో రూ.6 లక్షల అప్పు ఉంది. మూడు నెలల క్రితం స్వగ్రామంలో ఉన్న భూమిని విక్రయించి తల్లిదండ్రులు ఆ అప్పు చెల్లించారు. అనంతరం తండ్రి వెంకటరమణ సునీల్‌కి మరో రూ.లక్ష కూడా ఇచ్చాడు.

ఆన్ లైన్ లో యాప్ ద్వారా తీసుకున్న అప్పు విషయంలో.. వాటి నిర్వాహకులు ఒత్తిళ్లు తీవ్రం కావటం.. తీవ్రమైన మానసిక వేదనకు గురి చేశాయి. అప్పును సరైన సమయంలో తీర్చలేదంటూ.. యాప్ నిర్వాహకులు సునీల్ ఫోన్లోని డేటాను తీసుకొని.. అతడి స్నేహితులు.. బంధువులకు సునీల్ డిఫాల్టర్ అంటూ అతడి ఫోటోతో మెసేజ్ పంపారు. దీంతో.. తీవ్రమైన మనోవ్యధకు గురైన అతడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.

రూ.7ల‌క్ష‌ల ప్యాకేజీతో ఉద్యోగం వ‌చ్చినా..

ఈ విషాద ఉదంతంలో మ‌రో కోణం ఏమంటే.. అత‌డికి తాజాగా మ‌రో ఐటీ కంపెనీలో రూ.7లక్ష‌ల ప్యాకేజీతో ఉద్యోగం వ‌చ్చింది. బుధవారం మధ్యాహ్నం కంపెనీ నిర్వాహకులు కాల్‌ చేయగా, 'నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఉద్యోగం మరొకరికి ఇవ్వండి'అని చెప్పి కాల్‌ కట్‌ చేసి ఫోన్‌ స్విచ్ ‌ఆఫ్‌ చేశాడు. భోజనం చేసేందుకు రమ్మని సునీల్‌ భార్య తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో, కిటికీ లోంచి చూడగా అతడు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్టున్నారు.




Next Story