టీచర్‌పై ఆరేళ్ల బాలుడు కాల్పులు.. క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతుండగానే..

Six-year-old boy who shot his teacher used mother's gun. స్కూల్‌లోని క్లాస్‌రూమ్‌లో 25 ఏళ్ల వయస్సున్న టీచర్‌పై ఆరేళ్ల బాలుడు కాల్పులు జరిపాడు.

By అంజి  Published on  10 Jan 2023 10:07 AM IST
టీచర్‌పై ఆరేళ్ల బాలుడు కాల్పులు.. క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతుండగానే..

స్కూల్‌లోని క్లాస్‌రూమ్‌లో 25 ఏళ్ల వయస్సున్న టీచర్‌పై ఆరేళ్ల బాలుడు కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటన అమెరికాలోని వర్జీనియాలో జరిగింది. ప్రస్తుతం బాధిత టీచర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒకటో తరగతి చదువుతున్న బాలుడు తన తల్లి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన గన్‌ను స్కూల్‌కు తన బ్యాగులో తీసుకొచ్చాడు. టీచ‌ర్ ఏబీ జ్వెర్నర్ పాఠాలు చెబుతుండ‌గా.. ఒక్కసారిగా బ్యాగులోంచి గన్‌ తీసి ఆమెపై కాల్పులు జ‌రిపాడు బాలుడు. దీంతో ఆమె ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

అయినా ఆమె ఏ మాత్రం బెద‌ర‌కుండా మిగ‌తా పిల్ల‌ల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేసింది. క్లాస్‌లో ఉన్న పిల్ల‌లంద‌రినీ బ‌య‌ట‌కు పంపించేసింది. గన్‌ కాల్పుల శబ్దం విన్న స్కూల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే బాలుడు కాల్పులు జరిపాడని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు చీఫ్‌ స్టీవ్‌ డ్రోవ్‌ చెప్పారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని తెలిపారు. టీచర్‌ తనకు సహాయం కోసం పిలిచే ముందు ఆమె తన విద్యార్థులను సురక్షితంగా తీసుకువెళ్లిందని పోలీసులు చెప్పారు.

"ఆమె ఒక సైనికురాలు, ఆమె ఒక హీరో" అని పోలీసు చీఫ్ స్టీవ్ డ్రూ అన్నారు. కాల్పుల సమయంలో తరగతి గదిలో ఉన్న తన విద్యార్థుల యోగక్షేమాలను ఏబీ జ్వెర్నర్ పదే పదే అడిగారని తెలిపారు. విద్యార్థి డెస్క్‌కి సమీపంలో ఉన్న తరగతిలో 9 ఎంఎం టారస్ పిస్టల్, అతని బ్యాక్‌ప్యాక్, మొబైల్ ఫోన్, ఒక స్పెండ్ షెల్ కేసింగ్‌ను కనుగొన్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాదాపు 550 మంది విద్యార్థులున్న పాఠశాలలో మెటల్ డిటెక్టర్లు ఉండగా, విద్యార్థులను యాదృచ్ఛికంగా తనిఖీ చేశామని, ప్రతి చిన్నారిని తనిఖీ చేయలేదని అధికారులు తెలిపారు.

Next Story